తెలంగాణలో రాజన్న రాజ్యం: YS షర్మిల

తెలంగాణలో రాజన్న రాజ్యం: YS షర్మిల

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నది తన కోరిక అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల స్పష్టం చేశారు. దీనికోసం ఏం చేయాలన్న దానిపై జిల్లాల వారీగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటానని ఆమె చెప్పారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్సార్‌ అభిమానులతో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని నివాసంలో ఆమె భేటీ అయ్యారు. అలాగే అదే జిల్లా నాయకులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం బాగా జరిగిందని, అందరూ ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ప్రతీ జిల్లాకు చెందిన నేతలను కలుస్తానని, హైదరాబాద్‌లోనా.. లేక జిల్లాలకు వెళ్లాలా.. అనేది త్వరలో నిర్ణయిస్తానన్నారు. వారానికి ఒకటి లేదా రెండు జిల్లాల వారిని కలుస్తానని పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడు పెడుతున్నారని ప్రశ్నించగా, పార్టీ పెడుతున్నానని మీరే నిర్ణయించుకున్నారా అని మీడియాను ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా?.. విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? మీరే చెప్పాలని విలేకరులను అడిగారు. తాము సరైన దిశలో వెళుతున్నామని, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని షర్మిల వివరించారు. మీకు జగన్‌ మద్దతు ఉందా అని ప్రశ్నించగా, జగన్‌ మద్దతు లేదని మీకు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు.